ప్రైమరీ స్కూళ్లలో FLN కార్యక్రమం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
ప్రైమరీ స్కూళ్లలో తొలిమెట్టు పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరతు చేస్తుంది. FLN కార్యక్రమంపై విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో మొదటి తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల కోసం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో సామర్థ్యాలను పెంచేందుకు AI టూల్స్ వినియోగించనున్నారు.
వారానికి 80 నిమిషాల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెసన్ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ పీరియడ్ పేరుతో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తరగతి గదిలో వెనుకబడిన పిల్లల కోసం టీచర్ సపోర్ట్ గ్రూప్, పీర్ సపోర్ట్ గ్రూప్లను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
గత నాలుగు సంవత్సరాల్లో చేపట్టిన చర్యలతో జాతీయ స్థాయి సర్వేల్లో తెలంగాణ ర్యాంక్ 36 నుంచి 26కు మెరుగుపడిందని విద్యాశాఖ తెలిపింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం ప్రణాళికలు రూపొందించారు.
ఏడాదిలో మూడు సార్లు బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అంచనా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. MEO లు నెలకు కనీసం 20 స్కూళ్లను, కాంప్లెక్స్ HM లు 15 స్కూళ్లను సందర్శించి బోధన పద్ధతులను పరిశీలించాలని సూచించారు. ప్రతిరోజూ తరగతి గదిలో 30 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించి పిల్లలతో కథల పుస్తకాలు చదివించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com