హట్టి ఆశ్రమ పాఠశాలలో నాణ్యత లేని భోజనంపై విద్యార్థుల నిరసన
ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆహార నాణ్యత లోపంపై నిరసన వ్యక్తం చేశారు.
మెనూ ప్రకారం భోజనం ఇవ్వకుండా, నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం, ఇతర సరుకులను అధికారులు ఇష్టానుసారంగా తరలిస్తున్నారని, వంట సిబ్బందికి సరుకులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హెచ్ఎం మద్యం తాగి విధులకు వస్తున్నారని, వాచ్‌మెన్ కూడా మద్యం సేవించి ఉంటారని విద్యార్థులు ఆరోపించారు.
సాయంత్రం వండిన ఆలూ కూర్మాలో కేవలం నీళ్లు, ఉప్పు, కారం మాత్రమే ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఒక్క ముద్ద కూడా తినలేదని, రోజూ ఇదే పరిస్థితి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. పాఠశాలలో 350 మందికి పైగా ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు.
సమాచారం అందుకున్న ఐటీడీఏ పీఓ మకరందు సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. ఆందోళన అవసరం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులు ఆందోళన విరమించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com