తెలంగాణలో భారీ వర్షాలు: ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గోదావరికి వరద
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో వర్షం విస్తారంగా పడింది. కొన్ని చోట్ల భారీ వర్షం వల్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు గంటలు భారీ వర్షం కురవడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.
మహబూబాబాద్ జిల్లాలో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, చొప్పదండి, హుజూరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాల ప్రభావంతో కొన్ని చోట్ల వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. విత్తనాలు వేసిన రైతులు వర్షం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
వాతావరణ శాఖ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రేపు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద మొదలైంది. కొమరంబీం జిల్లాలో ప్రాణహిత నది ప్రవాహం ఉప్పొంగి పుష్కరఘాట్టు వద్ద జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు నీటిమట్టం 20 టీఎంసీల సామర్థ్యంలో ప్రస్తుతం 7 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com