ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు; రోడ్లు కొట్టుకుపోయి గిరిజన ప్రాంతాలు స్తంభించాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్చంద మండలం పీచల ధర్మారం సమీపంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో పీచల ధర్మారం, సోన్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదివాసీలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. ఊట్నూరు మండలం నరసాపూర్ ప్రాంతంలో వాగు పొంగడంతో గిరిజన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తిర్యాని మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, బేల, ఇచ్చోడ, నేరడుగొండ, ఇంద్రవెల్లి, కిరమేరి, జైనూరు తదితర మండలాల్లో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం గంటకు గంటకు పెరుగుతుండడంతో ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడం ప్రాజెక్టుకు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 11,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. నీటి మట్టం పెరుగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com