North India లో భారీ వర్షాలు, వరదలు; అరుణాచల్‌లో కొండచరియలు విరిగి 5 మంది గల్లంతు
ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆకస్మిక వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్-యాచులి జాతీయ రహదారి 13 పై కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రహదారిపై భారీగా శిథిలాలు పేరుకుపోగా, వాటిని తొలగించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అధిక వర్షం వల్ల ఏర్పడిన బురద కారణంగా సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన కేఈ పన్యోరు జిల్లాలోని యాచులీ పరిధిలో గల పూసా గ్రామంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
మహారాష్ట్రలోని టానే, పాల్గర్ జిల్లాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. టానే-పూణే మధ్య కీలకమైన మాల్షేజ్ ఘాట్‌లో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. ముంబైలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుర్లా, అందేరి, హింద్ మాత, మాతుంగా ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే, ఎన్‌ఎమ్ జోషి మార్గ్, లోయర్ పరేల్‌లో వాహనాలు నడవడం కష్టమైంది. మలాడ్ బస్ డిపో సమీపంలో నీరు నిలిచిపోయింది. అందేరి ప్రాంతంలోని సబ్‌వే పూర్తిగా మునిగింది. దీంతో అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేసింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్.
నిన్న ఒక్కరోజే ముంబైలో సగటున 184 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ శివార్లలో అత్యధికంగా 190 మిల్లీమీటర్లు, తూర్పు శివార్లలో 154 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా నమోదైనట్లు IMD వెల్లడించింది. మరో 24 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, దీంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు IMD హెచ్చరించింది.
అటు పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతాలో మధ్యాహ్నం రెండు గంటలకే ఆకాశం మేఘావృతమై చీకటి కమ్ముకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తారాతల ప్రాంతంలో వాహనదారులు పగటిపూటే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నైరుతి ఋతుపవనాలు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com