హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, ఇందిరా పార్క్, కవాడిగూడ, రామ్నగర్ ప్రాంతాల్లో వాన పడింది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, కిస్మత్పూర్, బండ్లగూడ, నార్సింగి, మణికొండ, కోకాపేట్, గండిపేటలో భారీ వర్షం కురిసింది. ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.
జిల్లాల్లో సాగుకు ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోరుట్ల, మెట్టుపల్లి ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే జనగాం, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.
వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వరసగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.060 టీఎంసీల నీరు చేరింది. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 275 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com