తెలంగాణలో భారీ వర్షాలు; చెరువు గండి, పంట పొలాలు మునిగాయి
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సిరికొండ మండలం కొండాపూరి చెరువుకు గండి పడింది. చెరువు కట్ట ధ్వంసం కావడంతో వరద నీరు ఆయకట్టు పంట పొలాల్లోకి చేరింది. వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సిర్నాపల్లి చెరువుకు కూడా వరద పోటెత్తింది. శీలం జానకిబాయి చెరువు నిండి మత్తడి పారుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్‌లోని కోటి, ఆబిడ్స్, నాంపల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బేగంపేట, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నా వాతావరణం మారి జల్లులు పడ్డాయి.
ఎగువ నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. నీటి మట్టం 1,078 అడుగులకు చేరుకుంది (పూర్తి స్థాయి 1,091 అడుగులు). పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,621 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 12,908 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం 515 మీటర్లకు చేరింది.
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. 29 గేట్లు ఎత్తి 2,24,741 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 2,06,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా నీటి మట్టం 871 అడుగులకు పెరిగింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com