తెలంగాణ

తెలంగాణలో భారీ వర్షాలు: మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో భారీ వర్షాలు: మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నిన్న రాష్ట్రంలో 30 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా మందమరిలో బలమైన గాలులతో చెట్లు విరిగిపడడం, విద్యుత్ స్తంభాలు కూలడంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగజ్ నగర్-కౌటాల, నిర్మల్ జిల్లా ప్రధాన రహదారులపై చెట్లు పడి గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సీఎస్, డీజీపీ, సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాలతో పోలీస్, హైడ్రా, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com