విజయవాడలో రూ.99 కే హెల్మెట్ శానిటైజేషన్ సేవ
విజయవాడలోని బందర్ రోడ్డులో ఉన్న పీవీపీ మాల్‌లో స్వచ్ఛ హెల్మెట్ డ్రై వాష్ యంత్రం ఏర్పాటు చేశారు. హెల్మెట్లో పేరుకుపోయే చెమట, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని శుభ్రం చేసేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. కేవలం ₹99 చెల్లించి ఐదు నిమిషాల వ్యవధిలో హెల్మెట్ను శానిటైజ్ చేసుకోవచ్చు.
ఈ యంత్రం పనితీరు గురించి నిర్వాహకుడు మాట్లాడుతూ, ముందుగా వాక్యూమ్ ద్వారా హెల్మెట్ లోపలి దుమ్ము, మురికిని తొలగిస్తామన్నారు. తర్వాత UV స్టెరిలైజేషన్, ప్రత్యేక ద్రావణం స్ప్రే చేస్తారు. ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పుతో హనీ లాంటి ద్రవం హెల్మెట్ అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఫాగింగ్ ద్వారా హెల్మెట్ మొత్తం సానిటైజ్ అవుతుంది. ఈ ప్రక్రియ వలన బ్యాక్టీరియా, ఫంగస్, జెర్మ్స్ 99.99% శాతం నశిస్తాయని, చర్మానికి, జుట్టుకు ఎలాంటి హానీ లేదని ఆయన వివరించారు.
పాత హెల్మెట్లకు డీప్ క్లీనింగ్ సేవ కూడా అందుబాటులో ఉంది. ఇందుకోసం ₹130 వసూలు చేస్తారు. ఈ యంత్రం రూపకల్పనకు సుమారు ₹4 లక్షలు ఖర్చైంది. దీనిని తెలుగు వ్యక్తే తయారు చేశారని నిర్వాహకుడు తెలిపారు. వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని, చాలా మంది వీడియోలు తీస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వచ్చే జొమాటో, రాపిడో డెలివరీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఈ సేవను వినియోగించుకుంటున్నారు.
ఈ సేవ పొందిన ఒక వినియోగదారుడు మాట్లాడుతూ, ఇంతకుముందు ఇంట్లో హెల్మెట్ శుభ్రం చేసుకున్నా వాసన, మురికి పూర్తిగా పోయేది కాదని, ఈ యంత్రంలో చేయించుకున్నాక వాసన లేకుండా శుభ్రంగా మారిందని తెలిపారు. సమయం కూడా చాలా తక్కువ కావడంతో ట్రై చేయాలని వచ్చామన్నారు. భవిష్యత్తులో విజయవాడ రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్, తాడిగడప ప్రాంతాల్లోనూ, విశాఖపట్నంలోని ఇనార్బిట్, సీఎంఆర్ మాల్స్‌లోనూ ఇలాంటి హెల్మెట్ శానిటైజేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు నిర్వాహకుడు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com