హైకోర్టు న్యాయవాది హత్య కేసు: సుపారి గ్యాంగ్ సభ్యులు ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో నాంపల్లి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. భూ వివాదం నేపథ్యంలో 15 లక్షల రూపాయలు సుపారిగా ఇచ్చి ఈ హత్యకు పథకం వేశారని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన మహబూబ్ అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్ తండ్రీకొడుకులకు మలక్‌పేట్ లక్డీకాపూర్‌లోని వక్ఫ్ భూముల విషయంలో న్యాయవాది మొయిజుద్దీన్‌తో దశాబ్దాలుగా వివాదం ఉంది. పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులు, న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. గతేడాది నుంచి గొడవలు తీవ్రమయ్యాయని పోలీసులు తెలిపారు.
ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున 5:45 గంటలకు న్యాయవాది మొయిజుద్దీన్ తన ఇంటి ముందు కారు ఎక్కుతున్న సమయంలో నిందితులు స్కార్పియో వాహనంతో వేగంగా వచ్చి ఢీ కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుమారుడు ఫర్హాన్ ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితులు నాలుగైదు నెలలుగా న్యాయవాది నివాసం సమీపంలో రెక్కీ నిర్వహించారు. ఆయన రోజూ ఉదయం swimming కోసం బయలుదేరే సమయాన్ని గమనించి దాడి చేశారని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిలో అభిజిత్ అలియాస్ నాని, మణిదీప్ అలియాస్ పోగు నాని ఉన్నారు.
CCTV కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 10 మంది ఈ హత్యలో పాల్గొన్నారని గుర్తించారు. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు CP సజ్జనర్ వెల్లడించారు. నిందితుల వద్ద 10 లక్షలకు పైగా నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారిలో ఉన్న మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com