జనగామలో హైటెన్షన్: పోలీసులు KTR ని అడ్డుకున్నారు
జనగామ జిల్లా పెంబర్తిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరగా, పోలీసులు పెంబర్తి వద్ద ఆయన వాహనాలను అడ్డుకున్నారు. కేవలం KTR కి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో BRS శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులకు BRS కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి భారీ బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. KTR తన వాహనం దిగి పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇవ్వొచ్చని KTR పేర్కొన్నారు. గోదావరి 93.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే చాలు, నీళ్లు అందించవచ్చని, రైతులు నాట్లు వేసుకోవచ్చని ఆయన వివరించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమను అడ్డుకుంటోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకే పోలీసులు అడ్డుకుంటున్నారని KTR ఆరోపించారు. కన్నెపల్లికి తప్పకుండా చేరుకుంటామని, లక్ష క్యూసెక్కుల నీళ్లు రైతులకు చూపిస్తామని KTR స్పష్టం చేశారు.
నిన్నటి నుంచే పోలీసులు అప్రమత్తమై BRS నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం, అరెస్ట్ చేయడం చేశారు. హన్మకొండలో సుభేదారి పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థి నాయకులతో సహా అనేకమంది BRS కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వరంగల్ నగరం, మడికొండ, పరకాల, భూపాలపల్లి మార్గంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com