ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం: రాష్ట్రవ్యాప్తంగా BLO ల ప్రత్యేక డ్రైవ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నేటి నుంచి ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభం: రాష్ట్రవ్యాప్తంగా BLO ల ప్రత్యేక డ్రైవ్
📷 Sachin Rawat / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు అంటే BLO లు ఇంటింటికి వెళతారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు ముద్రించి 46,397 మంది BLO లు ఈ సర్వేలో పాల్గొంటారు.

ఇంటింటి సర్వేలో పాల్గొనే BLO ప్రతి ఓటర్కు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. వాటిలో ఓటర్ పేరు, ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటర్ పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగతా వివరాలను ఓటర్ నింపాలి. అందుకు BLO లు సహకరిస్తారు. పూర్తి చేసిన ఫారాలను BLO లు వచ్చి తీసుకుంటారు. మొత్తం నెల రోజుల పాటు జరిగే ప్రక్రియలో ఫారాలు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి మూడు సార్లు BLO లు ప్రతి ఇంటికి వెళతారు.

2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకొని ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 కోట్ల 16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,68,86,239 మందికి 2002 నాటి జాబితాతో మ్యాపింగ్ పూర్తి అయింది. మరో 47,32,120 మంది మ్యాపింగ్ కావలసి ఉంది.

ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు 2002 నాటి జాబితాలో తమ లేదా కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇస్తే చాలు. ఇతర పత్రాలు ఏవీ అవసరం లేదు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు గరిష్టంగా 50 ధ్రువీకరించిన ఫారాలను BLO లకు సమర్పించవచ్చు.

2002 నాటి జాబితాలో పేరు ఉంటే ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నింపాలి. అప్పటి జాబితాలో పేరు లేకపోతే తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు, భార్య లేదా భర్త పేరు, వారి EPIC నెంబర్ వివరాలు నింపి కొత్త కలర్ ఫోటో అతికించి BLO కి ఇవ్వాలి. రెండు ఫారాలలో ఒక దానిపై BLO సంతకం చేసి దాన్నే రసీదుగా ఓటర్కు ఇస్తారు. దాన్ని భద్రపరుచుకోవాలి.

పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లు జూలై 14 లోగా తిరిగి BLO లకు సమర్పించాలి. ఫారాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వని ఓటర్లపై BLO లు క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తారు. తెలుసుకున్న కారణాలను పోలింగ్ కేంద్రంలోని నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తారు.

సరైన విచారణ చేపట్టకుండా జాబితా నుంచి ఓట్లు తొలగించినట్లు అనిపిస్తే ERO నిర్ణయంపై అభ్యంతరం ఉంటే 15 రోజుల్లోగా జిల్లా మెజిస్ట్రేట్ కు, 30 రోజుల్లోగా CEO కు అపీలు చేసుకోవచ్చు. 2002 నాటి మరియు ప్రస్తుత ఓటర్ల జాబితాలు పోలింగ్ కేంద్రాల వారీగా CEO ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులకు అందజేస్తారు. వారే ఆ ఓటర్ వివరాలు నింపి వారి తరపున సంతకం చేసి BLO కు ఇవ్వాలి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు మరియు అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్తగా ఓటర్గా చేరాలంటే ఫారం 6 లో, చిరునామా మార్పునకు ఫారం 8 లో, మృతులు మరియు అనర్హుల పేర్ల తొలగింపునకు ఫారం 7 లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 18 వరకు వాటిని పరిశీలించి అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరు చేరుస్తారు. సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com