హైదరాబాద్, రంగారెడ్డిలో బియ్యం దుకాణాలపై తనిఖీలు.. 18 సంస్థలపై చర్యలు, 11 ఎఫ్ఐఆర్లు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బియ్యం దుకాణాలపై సివిల్ సప్లైస్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఈ తనిఖీలు జరిగాయి. సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో ఎన్ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్, తూనికలు కొలతల శాఖ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రిటైల్, హోల్‌సేల్ బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలు అని లేబుళ్లు ముద్రించి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. కంపెనీలు ముద్రించిన అసలు ధరలపై ఎక్కువ ధరల స్టిక్కర్లు అతికించి అమ్మినట్లు తేలింది. ట్రేడ్, GST, లేబర్, FSSAI లైసెన్సులు లేకుండానే పలువురు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, పక్కదారి పట్టించడం వంటి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి.
నిందితులపై BNS నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై శాఖ తెలిపింది. నేర తీవ్రత ఆధారంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
కృత్రిమ కొరత సృష్టించడం, ధరలు పెంచడం, తూకంలో మోసం చేయడం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. నాణ్యమైన నిత్యవసర వస్తువులు సరైన ధరలకు అందించేందుకు తనిఖీలు కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com