బ్రహ్మపుత్ర నదిలో పడి ఐఐటీ గోహాటి విద్యార్థిని చేతన మృతి - జమ్మలమడుగు ఎంఆర్ఓ కూతురు
కడప జిల్లా జమ్మలమడుగు ఎంఆర్ఓ సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన (20) బ్రహ్మపుత్ర నదిలో పడి మృతి చెందింది. ఆమె ఐఐటీ గోహాటిలో ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థిని.
చేతన ఆరుగురు స్నేహితులతో కలిసి నదిని చూసేందుకు వెళ్లింది. ఒడ్డున ఉన్న ఇంటి దగ్గర నిలుచున్న సమయంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఒడ్డు కోతకు గురై ఇల్లు నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో చేతన నీటిలో పడి మృతి చెందగా, మిగతా స్నేహితులు సురక్షితంగా బయటపడ్డారు.
చేతన మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి సాయినాథ్ రెడ్డి బంధువులతో కలిసి అసోంకు బయలుదేరి వెళ్లారు. గత సంవత్సరమే ఆయన భార్య అనారోగ్యంతో మరణించగా, ఇప్పుడు కూతురిని కోల్పోయారు. చేతన పార్థివదేహాన్ని రేపు ఉదయానికి సొంత గ్రామమైన పెద్దముడికి తీసుకురానున్నట్లు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com