తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్ష సూచన; పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ – వాతావరణ శాఖ
తెలంగాణలో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ధ్రోని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు తగ్గుతాయని IMD వివరించింది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిరాల, ఆసిఫాబాద్, జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ నెల ప్రారంభం నుంచి రాష్ట్రంలో సగటు కంటే 23 మిల్లీమీటర్ల వర్షం లోటు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వర్షాధార వ్యవసాయం చేస్తున్న రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
నిన్న అదిలాబాద్ తలమడుగులో 42.9 డిగ్రీలు, జగిత్యాల రాఘవపేటలో 42.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో సహా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది.
ఇటీవల స్వల్ప వర్షాలకే హైదరాబాద్ రోడ్లు జామ్ అయిన నేపథ్యంలో, మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com