ట్రంప్, నెతన్యాహుపై ₹560 కోట్ల నజరానా: ఇరాన్ పార్లమెంట్లో బిల్లు సిద్ధం
ఇరాన్ పార్లమెంట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై నజరానా ప్రకటించే బిల్లు ప్రవేశపెట్టనున్నారు. వారిద్దరినీ హతమార్చే వ్యక్తులకు లేదా సంస్థలకు 58 మిలియన్ డాలర్లు (దాదాపు ₹560 కోట్లు) ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు.
ఇరాన్ జాతీయ భద్రత మండలి చైర్మన్ ఇబ్రహీం అజీజ్ ఈ ముసాయిదా బిల్లు సిద్ధమైందని తెలిపారు. బిల్లుకు 'ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య' అని పేరు పెట్టారు. ట్రంప్ మరియు నెతన్యాహుతో పాటు ఇరాన్‌పై దాడులకు వ్యూహరచన చేసిన అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్‌ను కూడా హతమార్చాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్‌లో త్వరలో ఓటింగ్ జరగనుందని అజీజ్ తెలిపారు.
టెహరాన్‌లోని అధికారిక నివాసంలో అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని మృతి చెందారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, ఇరాన్ రక్షణ మంత్రి, భద్రతా దళాల కమాండర్లు కూడా మరణించారు.
ఖమేని హత్యలో నెతన్యాహు కీలక పాత్ర పోషించారని, నెతన్యాహు ఒత్తిడితోనే ట్రంప్ ఈ దాడికి అనుమతించారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ గతంలోనే ఆరోపించారు. తనపై దాడి చేస్తే ఇరాన్‌ను భూమిపై లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com