జ్యేష్ఠ మాసంలో విశేష తిథులు: దశాపాపహర దశమి, నిర్జల ఏకాదశి, ఏరువాక పున్నమి
జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు ప్రత్యేకమైనవని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా శాస్త్రోక్తమైన దానాలు, పూజలు, ఉపవాసాలు విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
శుక్ల పక్ష దశమిని దశాపాపహర దశమిగా పిలుస్తారు. ఈ రోజు గంగా స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన పది రకాల దోషాలు నశిస్తాయని విశ్వాసం. శుక్ల పక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటే ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల ఫలం లభిస్తుందని వేద పండితులు వివరించారు.
జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్ష త్రయోదశి రోజు తేనె దానం ఇవ్వడం వల్ల సమస్త సంపదలు చేకూడతాయని శాస్త్ర వచనం. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఈ రోజు వ్యవసాయదారులు దుక్కి పనులు ప్రారంభిస్తారు. దీన్ని హలకర్మ లేదా సీతాయజ్ఞం అంటారు. ధర్మశాస్త్రాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు పత్తి దానం ఇస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. నీటికుండలు దానం ఇస్తే పితృ శాపాలు తొలగిపోతాయి.
ఈ మాసంలో అమావాస్య రోజు మర్రి చెట్టును పూజించడం సంప్రదాయం. జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం ఆచరించడం మంచిది. సాధ్యం కాకపోతే అమావాస్య రోజు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ పూజ వల్ల మహిళలకు దీర్ఘ సౌమంగళ్యం, అపమృత్యు దోష నివారణ, కుటుంబంలోని సభ్యుల ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com