తెలంగాణ

మేడిగడ్డలో సాంకేతిక పరీక్షలు పెండింగ్‌లో... కాళేశ్వరం మరమత్తులు గడువు దాటుతున్నాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మేడిగడ్డలో సాంకేతిక పరీక్షలు పెండింగ్‌లో... కాళేశ్వరం మరమత్తులు గడువు దాటుతున్నాయి
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజులకు మరమత్తులు చేస్తున్నామని రేవంత్ సర్కారు చేస్తున్న హడావుడికి క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదు. డెడ్లైన్లు విధించుకోవడం, అవి దాటిపోవడం, మళ్ళీ కొత్త డెడ్లైన్లు ప్రకటించడం పరిపాటిగా మారింది.

వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఉన్న స్వల్ప సమయంలో సాంకేతిక పరీక్షలు పూర్తయ్యే పరిస్థితులు కనబడటం లేదు. NDAC నివేదిక సూచనల మేరకు బరాజులకు సంబంధించి జియో ఫిజికల్, జియో టెక్నికల్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్టులను పూణేలోని CWPRS ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది.

ఆ పరీక్షల నివేదికలను CWPRS మరియు NDAC కు పంపి డిజైన్లు రూపొందించి ఆమోదం పొందిన తర్వాతే పనులు చేపట్టాల్సి ఉంటుంది. మే ఆఖరిలోగా టెస్టులు పూర్తి చేస్తామని సర్కారు ప్రకటించింది. రోజువారీ ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తదితరులు మేడిగడ్డలో అట్టహాసంగా పర్యటించారు. NDAC చైర్మన్, CWPRS డైరెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులను వెంటబెట్టుకుని వెళ్ళి పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఆచరణలో మాత్రం అరకొరగా బోర్‌హోల్స్ పరీక్షలు కొనసాగుతుండగా అత్యధిక సాంకేతిక పరీక్షలు ఇంకా ప్రారంభమే కాలేదు. CWPRS ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, జియో టెక్నికల్, జియో ఫిజికల్ అధ్యయనాలు క్షేత్రస్థాయిలో ముందుకు సాగడం లేదు.

వానలు జోరందుకుంటే గోదావరిలో, ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ప్రాణహిత నదిలో వరద ప్రవాహాలు ప్రారంభమవుతాయి. వరద వస్తే సాంకేతిక పరీక్షల నిర్వహణ కష్టమవుతుంది. అప్పుడు నవంబర్‌-డిసెంబర్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు నిర్ణీత సమయంలో ప్రాజెక్టు మరమత్తులు పూర్తి చేయగలదా అనేది కీలక ప్రశ్నగా మారింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com