మహారాష్ట్ర TET పేపర్ లీక్: CM ఫడ్నవీస్ SIT విచారణకు ఆదేశం, పరీక్ష వాయిదా
మహారాష్ట్రలో TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పేపర్ లీక్ కేసులో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేశారు. ఠానే జాయింట్ సీపీ పంజాబ్ రావు ఉగాలే ఈ SIT కు నేతృత్వం వహిస్తారు.
భివాండీలో శనివారం పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రశ్నపత్రం లీకైనట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన TET పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. కొన్ని పత్రాలతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, స్వాధీనం చేసుకున్న ప్రశ్నలు నేటి పరీక్ష ప్రశ్నపత్రంతో సరిపోలినట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ కేసులో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్ విద్యాశాఖ మంత్రి దాదా భూసే, డీజీపీ సదానంద్ దాతేలను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే స్పందిస్తూ, పేపర్ లీక్ కేవలం పరీక్షల అక్రమం కాదని, ఇది వ్యవస్థీకృత నేరమని పేర్కొన్నారు. సూత్రధారులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని సీఎంను కోరతామని సిందే తెలిపారు.
భివాండి పోలీసులు ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. SIT విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com