ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మణిదీప్ రెడ్డి మృతదేహం లభ్యం, గుర్తింపు నిర్ధారణపై కుటుంబం తీవ్ర ఆక్షేపణ
హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి మణిదీప్ రెడ్డి మృతదేహం ఫిన్లాండ్‌లోని హెల్సింకీ సముద్రంలో లభ్యమైనట్లు ఆ దేశ పోలీసులు ప్రకటించారు. మే నెలలో తప్పిపోయిన మణిదీప్ చివరిసారిగా మే 5న హెల్సింకీలోని ఓ సూపర్‌మార్కెట్‌లో కనిపించాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ లేకపోవడంతో విస్తృత గాలింపు చేపట్టిన అధికారులు, ఇటీవల సముద్రంలో దొరికిన మృతదేహాన్ని మణిదీప్‌దిగా గుర్తించామని తెలిపారు.
అయితే, ఈ గుర్తింపును మణిదీప్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తల్లి మమతా రెడ్డి మాట్లాడుతూ, డీఎన్ఏ పరీక్షగానీ, ఇతర ఆధారాలు చూపకుండానే తన కుమారుడి మృతదేహమని పోలీసులు ప్రకటించడం ఆమోదయోగ్యం కాదన్నారు. "మృతదేహం ఫొటో కూడా పంపలేదు. డీఎన్ఏ టెస్ట్ చేయలేదు. మెడికల్ రిపోర్టు, వ్యక్తిగత వస్తువులు ఏవీ చూపించలేదు. ఇలాంటి నిర్ధారణ ఎలా చేస్తారు?" అని ఆమె ప్రశ్నించారు. కుటుంబం విజ్ఞప్తి చేసినా, ఫిన్లాండ్ వీసా తిరస్కరించారని, ఇండియన్ ఎంబసీ కూడా సరైన సమాచారం అందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మణిదీప్ తనంతట తానుగా సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసుల వాదనను తల్లి ఖండించారు. తన కుమారుడు అంత భయపడే స్వభావం కాదని, అతడిని ఎవరో ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. "నా కొడుకు బతికే ఉన్నాడు. ఈ బాడీ నా బిడ్డది కాదు. డీఎన్ఏ టెస్ట్ లేకుండా ప్రెస్‌కు రిలీజ్ ఇవ్వడం అన్యాయం" అని ఆమె పేర్కొన్నారు. మణిదీప్ చివరిసారిగా తనతో మే 4న ఫోన్‌లో మాట్లాడాడని చెప్పారు. కోర్టులో విచారణ జూన్ 16న జరగనుండగా, ముందు రోజే బాడీ దొరికిందంటూ వస్తున్న వార్తలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ స్పందించాలని కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. తన కొడుకును వెతికించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మమతా రెడ్డి కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com