ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేందుకు ఏడుస్తున్నాడని మూడేళ్ల కొడుకును చంపిన తల్లి
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడిని గొంతు నొక్కి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో బిడ్డ ఏడుపు అడ్డురావడంతో ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితురాలు 32 ఏళ్ల రుచి జిందాల్. ఆమె భర్త స్థానికంగా మందుల దుకాణం నడుపుతున్నారు. జూన్ 28న రుచి తన కుమారుడిని చంపి, పోలియో చుక్కలు వేయడం వల్ల బిడ్డ అస్వస్థతకు గురై మరణించాడని భర్తకు, కుటుంబ సభ్యులకు నమ్మించింది. డాక్టర్లు బాలుడు మృతి చెందాడని నిర్ధారించడంతో కొద్ది రోజులు ఎవరికీ అనుమానం రాలేదు.
అయితే ఇటీవల రుచి మళ్లీ తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ బిడ్డ హత్య గురించి ప్రస్తావించింది. ఆ సంభాషణను భర్త చాటుగా వినడంతో నిజం బయటపడింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, కాల్ డేటా పరిశీలించగా అనైతిక ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రుచి జిందాల్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com