దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్.. కియా ఈవీ విస్తరణకు ప్రతిపాదనలు
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ఐదో రోజు సియోల్లో ఆ దేశ విదేశీ వ్యవహారాల ఉపమంత్రి యుహే సిసిలియా చుంగ్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3ఎస్ విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఏపీలో అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకు భూమి సబ్సిడీల గురించి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు కొరియా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కోరారు. అదనంగా, ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, సంయుక్త శిక్షణ అకాడమీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
అంతకుముందు మంత్రి లోకేష్ కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కియా ప్రాజెక్టుల విస్తరణపై పలు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా, ఇంటిగ్రేటెడ్ ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రం విస్తరణ, విశాఖపట్నం పోర్ట్ సమీపంలో సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్‌పోర్ట్ సెంటర్, ఈవీ కాంపోనెంట్ల తయారీ, ఈవీ పవర్ ట్రైన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు వంటి ప్రతిపాదనలను వివరించారు.
దీనిపై స్పందించిన కియా ప్రతినిధులు, తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com