మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన నేటి నుంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించిన నేపథ్యంలో ఈ పర్యటన చేపడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఈ పర్యటన ఇవాళ (జూలై 6) మొదలై జూలై 11 వరకు కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం సియోల్‌లోని ఇండియా డయాస్పోరా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని భారతీయులతో, ముఖ్యంగా తెలుగు ప్రజలతో సంభాషిస్తారు. అదే రోజు కొరియన్ టెక్ స్టార్టప్‌ల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతారు.
జూలై 8న హ్యాసంగ్ హెవీ ఇండస్ట్రీస్ చైర్మన్ టకేషి యోకోటా, సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహూంగ్ లీలతో వరుసగా సమావేశమవుతారు. అదే రోజు ఎల్జీ టవర్స్‌లో ఎల్జీ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ అధ్యక్షుడు యుంజో కోహో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. జూలై 9న కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ, అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల విభాగాల డిప్యూటీ మంత్రులతో విడివిడిగా సమావేశాలు జరుగుతాయి.
జూలై 10న వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చలతో పాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ 2026 ప్రచారం కోసం కొరియా కంపెనీలతో ప్రత్యేక రోడ్‌షో నిర్వహిస్తారు. జూలై 11న ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తారు.
దక్షిణ కొరియా కౌన్సిలేట్ జనరల్ చాంగ్న్ కి ఆహ్వాన లేఖలో, ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారం పెంపొందించడానికి కీలకమని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com