ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభిస్తారు. ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి భోగాపురం చేరుకుంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
అనంతరం 10:55 నిమిషాలకు ప్రధాని ప్రయాణికుల టెర్మినల్ భవనం వద్దకు చేరుకుంటారు. అక్కడ 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యం ద్వారా స్వాగతం పలుకుతారు. సుమారు 15 నిమిషాల పాటు విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత, ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు.
భోగాపురంలో ఇప్పటికే గిన్నిస్ రికార్డు నమోదు చేసిన 13,000 మంది గిరిజన కళాకారులు తమ థింసా నృత్య ప్రదర్శన ఇస్తారు. ఇది ఉత్తరాంధ్ర సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రానున్న 10 ఏళ్లలో విమానాశ్రయం చుట్టూ నగర నమూనా, పారిశ్రామిక కారిడార్, కార్గో సదుపాయాలు, లాజిస్టిక్ పార్కులు, ఏవియేషన్ యూనివర్సిటీ, కార్పొరేట్ ఆస్పత్రులు వంటి మౌలిక సదుపాయాలు రానున్నాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరిగి, విశాఖ పట్టణ శివార్లలో భోగాపురం ఒక ముఖ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com