గురుకులాల పరిశుభ్రత, మెనూ అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
గురుకులాలు, హాస్టల్లు ప్రారంభమై ఇరవై రోజులు పూర్తయిన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల అమలు తీరును పరిశీలించారు.
హాస్టల్‌లను పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని, ప్రభుత్వం నిర్ణయించిన మెనును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు తరచూ హాస్టల్‌లను సందర్శించి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. డీబీసీవోలు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు.
స్టడీ సర్కిల్స్‌లో నాణ్యత పెంచేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న స్టడీ సర్కిల్స్ విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కులవృత్తుల మేళాల్లో అన్ని కులాల సంప్రదాయ వృత్తిదారులకు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కుట్టుమిషన్ పథకం అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, గురుకులాల కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ల్యాప్‌టాప్, ఇతర కిట్‌లు వెంటనే పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com