ఆరుగురి హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ పరారీ
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రాజ్కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితుడి ఆచూకి కోసం 10 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర సమాచారం ఆధారంగా ఈ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
నిన్న తెల్లవారుజామున కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాజ్కుమార్ తన కారును వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన తల్లి స్వగ్రామం పెంజర్లకు వెళ్లి ఉంటాడనే ఉద్దేశంతో పోలీసులు అక్కడ గాలించినా ఆచూకి దొరకలేదు. నందిగామ సమీపంలో నిన్న ఉదయం అతడు కనిపించినట్లు సమాచారం అందగా పోలీసులు వెళ్లేసరికి ఆచూకి లేకుండా పోయింది.
పోలీసుల విచారణలో రాజ్కుమార్ గురించి పలు వివరాలు వెల్లడయ్యాయి. ఇంటర్ చదివేటప్పుడు తన కంటే ఆరేళ్లు పెద్దదైన సరితను ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక రెండేళ్లు డ్రైవర్‌గా పనిచేసి, తర్వాత మద్యం, జూదం వ్యసనాలకు అలవాటయ్యాడు. రూ.2.5 కోట్లకు పైగా అప్పు చేశాడు. ఈ ఒత్తిడితో గత ఏడాది అక్టోబర్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. పొలం అమ్మి కొన్ని అప్పులు తీర్చామని నిందితుడి తండ్రి అరుణ్ కుమార్ చెప్పారు.
ఈ ఘటనలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బాలిక, ఆమె తల్లి నారమ్మ హత్యలపై బాలిక మేనమామ ఫిర్యాదుతో ఒక కేసు, భార్య సరిత, ఇద్దరు పిల్లల హత్యలపై మరో కేసు నమోదయింది. నిందితుడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 10 బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com