సాయికృష్ణ లాకప్ డెత్ కేసు: పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై అస్థికలు, బూడిద లభ్యం; హైకోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు కీలక సాక్ష్యాలను సేకరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై కాలిన ఎముకలు, బూడిదను గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. ఆస్టేషన్‌లో లాఠీపై అనుమానాస్పద మరకలు, పాక్షికంగా కాలిన బ్రాస్లెట్ వంటి వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నట్లు సిట్ తన పిటిషన్‌లో పేర్కొంది.
సిట్ కస్టడీ కోసం విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడు సిఐ నాగరాజుకు ఎనిమిది రోజుల కస్టడీ అనుమతించినా కఠిన షరతులు విధించింది. దీనిపై సిట్ అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు షరతులను రద్దు చేయాలని కోరారు. విచారణ జరిపిన హైకోర్ట్ తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు స్పష్టత వచ్చేవరకు నాగరాజుపై విచారణ తాత్కాలికంగా నిలిపివేయబడింది.
నిర్దోషినని పేర్కొంటూ నాగరాజు న్యాయమూర్తికి 18 పేజీల లేఖ రాశారు. తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని, కస్టడీ పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపితే న్యాయవాదుల సమక్షంలోనే జరపాలని, కోర్టు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు మెజిస్ట్రేరియల్ విచారణ కూడా కొనసాగుతోంది. శనివారం ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కేసుపై విచారణ జరుగుతుంది. కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా తెలియజేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుపైనే సిట్ తదుపరి చర్యలు ఆధారపడి ఉన్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com