పంట మార్పిడితో అధిక దిగుబడి, నేల సారాన్ని కాపాడుకోవచ్చు: మంత్రి సీతక్క
ములుగు జిల్లా గోవిందరావుపేటలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడితో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో ఆవు పేడ, చెరువు మట్టి వంటి సహజ ఎరువులు వాడటం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని వివరించారు.
పురుగుమందులపై అధికంగా ఆధారపడటం వల్ల నేల నాణ్యత దెబ్బతినడంతోపాటు దిగుబడి తగ్గుతోందని ఆమె అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అందిస్తున్న సాంకేతిక సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతులకు అండగా నిలుస్తానని ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాల వివరాలను గుర్తు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల స్థాయిలో రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని సీతక్క తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com