విజయవాడ ఇంద్రకీలాద్రిలో రేపటి నుంచి శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో అమ్మవారు శ్రీ శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు.
ఈ ఉత్సవాల సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. దుర్గమల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు ధర్మకర్తల మండలి సహకారంతో తొలి విడతగా 7 టన్నుల కూరగాయలను అమ్మవారికి సమర్పించారు. తాడేపల్లిగూడెం, తణుకు, మడికి, సిద్ధాంతం, ఏలూరు, గుంటూరు జిల్లాలోని జాగర్లమూడి, తెనాలి, ఎడ్లపల్లి, నారకూడూరు, కృష్ణ జిల్లాలోని నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాల ప్రాంతాల నుంచి భారీగా కూరగాయలను సేకరించారు. దేవస్థానం బస్సుల ద్వారా వీటిని ఇంద్రకీలాద్రికి సురక్షితంగా తరలించారు.
ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం (నేటి) మధ్యాహ్నం 3 గంటల వరకు protocol VIP దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికే సినా నాయకు ప్రకటించారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఘాట్ రోడ్డు వైపు ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ పూర్తిస్థాయిలో దేవస్థానం బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లులు రద్దీ తక్కువగా ఉండే సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య దర్శనానికి రావాలని సూచించారు. భక్తులు దేవస్థాన నియమాలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com