చెరకు సాగులో పురుగుల నివారణపై శాస్త్రవేత్త సూచనలు
చెరకు పంట ప్రస్తుతం 6 నుంచి 8 నెలల వయస్సులో ఉంది. రైతులు జడ చుట్లు వేస్తున్న దశలో ఉన్నారు. ఈ సమయంలో ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలో ఉయ్యూర్ చెరకు పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి వివరించారు.
ఆమె మాట్లాడుతూ... జడ చుట్ల తర్వాత ఎరువులు వేయడం వల్ల పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గుతుంది. కాబట్టి జడ చుట్లు వేసే ముందే ఎరువులు ఆపేయాలి. ఇక వర్షాలు కురుస్తున్నందున రసం పీల్చే పురుగుల ఉదృతి తాత్కాలికంగా తగ్గుతుందని, వర్షాలు తగ్గి ఉక్కపోత వాతావరణం ఏర్పడితే మళ్లీ పొలుసు పురుగు, దూదేకుల పురుగు వంటివి ఆశించే అవకాశం ఉందని హెచ్చరించారు.
వీటి నివారణకు ఒకే రసాయనం సరిపోతుందని, ఇమిడాక్లోప్రిడ్ (0.3 మి.లీ. లీటర్ నీటికి) లేదా ఎసిటామిప్రిడ్ (0.2 గ్రా. లీటర్ నీటికి) పిచికారీ చేస్తే సరిపోతుందని తెలిపారు. వేరు పురుగు (రూట్ గ్రబ్) ఉదృతి ఈ ఏడాది ఎక్కువగా ఉందని క్షేత్ర పరిశీలనలో గమనించినట్లు చెప్పారు. తల్లి పురుగులు తుమ్మ, వేప చెట్లపై కనిపిస్తాయని, వాటి నివారణకు చుట్టూ ఎత్తైన మొక్కలపై వేప నూనె పిచికారీ చేయాలన్నారు. లార్వా దశలో క్లోరిపైరిఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ కాంబినేషన్ మందును వేర్లకు తడిసేలా పిచికారీ చేయాలని సూచించారు.
ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, వరి పొలాల్లో డ్రమ్ సీడింగ్ చేసిన చోట నుంచి చెరకు పొలాల్లోకి వస్తున్నాయని తెలిపారు. వీటి నివారణకు 960 గ్రా. నూకలు, 20 గ్రా. నూనె, 20 గ్రా. బ్రోడిఫేకం మందు కలిపి 10-15 గ్రా. చిన్న పొట్లాలు కట్టి ఎలుకల కలుగుల్లో వేయాలని సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com