వాతావరణం

ఈ ఏడాది సూపర్ ఎల్నినోతో వర్షాభావం, రైతులు తక్కువ నీటి పంటలు వేయాలని నిపుణుల సూచన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఈ ఏడాది సూపర్ ఎల్నినోతో వర్షాభావం, రైతులు తక్కువ నీటి పంటలు వేయాలని నిపుణుల సూచన
📷 shyam mishra / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఈ సంవత్సరం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ ఎల్నినో కారణంగా భారతదేశంలో నైరుత్తి రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ భౌగోళిక నిపుణులు జల్లు సద్గుణరావు తెలిపారు.

ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం, పసిఫిక్ సముద్రంలో పెరు తీరంలో నీరు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఎల్నినో పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో దక్షిణ డోలనం (Southern Oscillation) తూర్పు వైపు మారడంతో భారతదేశంపై రుతుపవనాల ప్రభావం తగ్గుతుంది. సాధారణంగా లా నినా (చల్లనీరు) సమయంలో దక్షిణ డోలనం పశ్చిమంగా మారి మనకు అనుకూలంగా మారుతుంది.

ఈ సంవత్సరం పసిఫిక్ నీటి ఉష్ణోగ్రత 26°C కంటే ఎక్కువగా నమోదవడంతో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా హిందూ మహాసముద్రంలో ఇండియన్ డైపోల్ (IOD) ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నా, నెగెటివ్ గా మారితే కరువు పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని చెబుతున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలు జూలై చివరిలో కూడా 20% కూడా నిండలేదు. సాధారణంగా ఈ సీజన్‌లో 70% నిండాలి. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువ నీరు కోరే వరి, చెరకు బదులుగా తక్కువ నీటిలో పండే జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, వేరుశనగ, పండ్ల తోటలు వంటి పంటలు వేసుకోవాలని సద్గుణరావు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com