ఆసరా పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని CM రేవంత్ ఆదేశాలు
తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు పోస్టల్ శాఖ ద్వారా పెన్షన్లు అందజేస్తున్న విధానం మారనుంది.
ప్రభుత్వం ₹2,016 పెన్షన్ ఇస్తుండగా పోస్టల్ ఆఫీసు ద్వారా మాత్రం ₹2,000 మాత్రమే లబ్దిదారులకు చేరుతోంది. ₹16 తేడా వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే చనిపోయిన వారి పేరుపై పెన్షన్లు కొనసాగడం వంటి అక్రమాలు పోస్టల్ శాఖ ద్వారా జరుగుతున్నాయని నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది.
జూన్ 2 నుంచి కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని CM రేవంత్ సూచించారు. ఆ తర్వాత వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 2న తెలంగాణ అవిభావ దినోత్సవం సందర్భంగా దాదాపు లక్ష కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పెన్షన్లు ఉన్నాయి. కొంతమంది ఒకటికి మించిన పెన్షన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో voter ID, ఆధార్, సామాజిక ఆర్థిక సర్వే డేటా ఆధారంగా పెన్షన్ల re-verification చేస్తున్నారు. అనర్హులను తొలగించి అర్హులందరికీ పెన్షన్లు అందించడం ప్రభుత్వ లక్ష్యం.
ఇప్పటివరకు 80% లబ్దిదారుల బ్యాంకు వివరాలు అధికారులు సేకరించారు. మిగిలిన వారు బ్యాంకు ఖాతాలో సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 2 నాటికి బ్యాంకు ఖాతా సక్రమంగా ఉంటేనే పెన్షన్ జమ అవుతుందని తెలిపారు.
పంచాయతీ కార్మికులకు సంబంధించి కూడా CM రేవంత్ ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న 50 వేల మంది సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల ₹50 కోట్లు మంజూరు చేయనుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com