తెలంగాణ

కొనుగోలు కేంద్రాల్లో జాప్యం: వరంగల్ రైతు గుండెపోటుతో మృతి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కొనుగోలు కేంద్రాల్లో జాప్యం: వరంగల్ రైతు గుండెపోటుతో మృతి
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఆలంకానిపేటకు చెందిన వెంకటేశ్వరులు అనే రైతు కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందారు. మూడు రోజుల క్రితం వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ఆయన, కళ్ళంపై పంట నేరుపుతుండగా అక్కడికక్కడే కన్నుమూశారు.

తెలంగాణలో పలు జిల్లాల్లో పంట కొనుగోళ్ళు జాప్యమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరిలో కొనుగోళ్ళు సక్రమంగా సాగడం లేదంటూ రైతులు మార్కెట్‌కు తాళం వేసి నిరసన చేపట్టారు. మెదక్ జిల్లా రాయంపేటలో నెల రోజులైనా తూకం వేయలేదని రైతులు రాస్తారోకో నిర్వహించారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద మొక్కజొన్న లోడుతో వందల సంఖ్యలో ట్రాక్టర్లు వరుస కట్టాయి. లారీలు రాకపోవడంతో పంట కళ్ళాల్లోనే ఉండిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా సివ్వంపేట మండలం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నర్సాపూర్ MLA సునీతా రెడ్డి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరుగు, తేమా పేరుతో రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంట తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com