హైడ్రా కమిషనర్, శంషాబాద్ తహసీల్దార్‌కు హైకోర్టు ఆదేశం: మంగళవారం స్వయంగా హాజరు కావాల్సిందే
శంషాబాద్ మండలంలోని భూ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ వచ్చే మంగళవారం కోర్టుకు స్వయంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
ఇద్దరు అధికారులను విచారణకు హాజరు పరిచే బాధ్యతను కోర్టు పోలీసు అధికారులకు అప్పగించింది. హైడ్రా కమిషనర్‌ను DGP సి.వి. ఆనంద్ కోర్టుకు తీసుకురావాలి. శంషాబాద్ తహసీల్దార్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో నవంబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు గతంలోనే ఇద్దరు అధికారులకు ఫారం-1 నోటీసులు జారీ చేసింది. బుధవారం కేసు విచారణకు వచ్చిన సమయంలో ఇద్దరు అధికారులు కోర్టుకు రాలేదు.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇద్దరు అధికారులు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మినహాయింపు కోరేందుకు అధికారులు చూపిన కారణాలు సహేతుకంగా లేవని ఆయన పేర్కొన్నారు. దీంతో రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com