తెలంగాణలో వర్షాలు: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద, హైదరాబాద్‌లో రోడ్లు జలమయం
తెలంగాణలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వర్షం మొదలైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మసబ్ ట్యాంక్‌తోపాటు ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఐటి కారిడార్లోని మాదాపూర్, గచ్చిబోలి, హైటెక్ సిటీల్లో వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర రామలక్ష్మణపల్లె వద్ద మానేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న కాజ్వేపై పల్సర్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు తాళ్ల సాయంతో ఇద్దరినీ, బైక్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 2.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటిమట్టం 317.53 మీటర్లకు చేరడంతో అధికారులు 33 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2.77 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 886 అడుగులకు పెరగగా, ప్రస్తుత నిల్వ 129 టీఎంసీలుగా ఉంది.
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకూ వరద కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండగా, నీటిమట్టం మరింత పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,158 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టానికి చేరుకుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com