యూరియా అక్రమాలపై మంత్రి తుమ్మల హెచ్చరిక; కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా దుర్వినియోగంపై కఠినంగా స్పందించారు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో యూరియా బస్తాలు పక్కదారి పట్టిన ఘటనలపై ఆయన విచారణను వేగవంతం చేశారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలో యూరియా అప్ ద్వారా బుక్ చేసుకున్న 103 బస్తాలు కనిపించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సొసైటీ ఇంచార్జ్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల తీవ్రంగా స్పందించారు. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు.
కొత్తగా తీసుకొచ్చిన యూరియా app ద్వారానే ఈ అక్రమాలు వెలుగుచూస్తున్నాయని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో 6000 యూరియా బస్తాలు మాయమైన ఉదంతాన్ని ఇదే app సాయంతో గుర్తించామన్నారు. ఈ కేసులో బాధ్యులైన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వ్యవసాయ శాఖ అధికారిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, ఎరువుల పంపినీలో పారదర్శకత కోసమే యూరియా app ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలిగించే అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com