హైదరాబాద్ 31°C
అమరావతి 35°C
IST 2:20 PM
సోమవారం ఆగస్టు 3 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లాలో 10 నెలలుగా సంచరిస్తున్న పెద్దపులి; బంధించేందుకు 60 మందితో ఆపరేషన్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏలూరు జిల్లాలో 10 నెలలుగా సంచరిస్తున్న పెద్దపులి; బంధించేందుకు 60 మందితో ఆపరేషన్
📷 Luca Severin / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏలూరు జిల్లా, పరిసర ప్రాంతాల్లో సుమారు 10 నెలలుగా ఓ పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. మనుషులకు హాని తలపెట్టకపోయినా ఈ పులి కారణంగా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

పులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర, బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలతో పాటు ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ బృందాన్ని రంగంలోకి దించారు. మొత్తం 60 మంది నిపుణులు శోధన కొనసాగిస్తున్నారు. 6 గురు ట్రాంక్విలైజింగ్ షూటర్లు పెద్ద చెట్లపై మంచెలు ఏర్పాటు చేసి మత్తుమందు గుళ్లతో షూట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే పులి తెలివిగా మనుషుల వాసన పసికట్టి ఆ ప్రాంతాలకు రావడం లేదు. గతంలో కాకినాడ వద్ద మత్తుమందుకు గురైన అనుభవం ఉండడంతో ఈ పులి మరింత చురుగ్గా తప్పించుకుంటోందని అధికారులు చెప్తున్నారు. ఇది ఐదేళ్ల వయసులోపు పులిగా గుర్తించారు.

పులి ప్రధానంగా వెలేరుపాడు, బుట్టాయిగూడెం, గోపాలపురం, పోలవరం మండలాల పరిసర గ్రామాల్లో సంచరిస్తోంది. వంటూరు వద్ద గోదావరి నది పాయ సన్నగా ఉండడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సులభంగా దాటుతోంది. పులిని బంధించాక అభయారణ్యంలో వదిలేయాలా లేక జూకు తరలించాలా అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదని అటవీశాఖ వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com