తిరుమల శ్రీవారి ఆలయంలో 750 శాసనాల డిజిటలైజేషన్: ASI భారత్ శ్రీ ప్రాజెక్ట్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, వందల సంవత్సరాల ఘన చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలుస్తోంది. ఆ చరిత్రను భావితరాలకు అందించేందుకు భారత పురావస్తు శాఖ అంటే ASI ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
భారత్ శ్రీ ప్రాజెక్ట్ లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలలో ఉన్న దాదాపు 750 శాసనాలను ASI డిజిటలైజేషన్ చేస్తోంది. ASI లోని శాసన విభాగం ఈ పనిని చేపట్టింది.
గతంలో 1889, 1904, 1912, 1916 సంవత్సరాలలో ఆలయ రెండవ ప్రాకారం నుంచి 44 శాసనాలను సేకరించారు. తర్వాత 2008 నుంచి 2009 మధ్య గర్భాలయం అంటే ఆనంద నిలయం గోడల నుంచి మరో 53 శాసనాలు సేకరించారు. ఇప్పుడు మిగిలిన సుమారు 600 శాసనాలను సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది.
TTD కు చెందిన ప్రముఖ శాసన పరిశోధకులు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గతంలో తిరుమల శాసనాలను పరిశీలించి వాటిపై కొన్ని సంపుటాలు ప్రచురించారు. అయినప్పటికీ అనేక శాసనాలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
ఈ 750 శాసనాలు ఆలయానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను తెలియజేస్తున్నాయి. ప్రభువులు, సామంతులు, రాజులు, East India Company పాలకులు, మహంతులు తిరుమల శ్రీవారికి చేసిన సేవలు, సమర్పించిన కానుకలు, దానధర్మాల వివరాలు ఈ శాసనాలలో పొందుపరచబడ్డాయి.
డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత వాటిని ASI వెబ్సైట్ అయిన భారత్ శ్రీ పోర్టల్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. పరిశోధకులు, చరిత్రకారులు వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
ముఖ్యమైన విషయమేమంటే సుమారు 10 మీటర్ల పొడవైన ఒక తమిళ శాసనం విజయనగర సామ్రాజ్య కాలానికి అంటే CE 16వ శతాబ్దానికి చెందినదని ASI అధికారులు గుర్తించారు. అలాగే వైదుంబ శాసనాలు 10వ శతాబ్దం నాటివిగా గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో TTD కూడా ASI కు సంపూర్ణ సహకారం అందిస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com