జగిత్యాల జిల్లాలో కుండపోత వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు
జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సారంగాపూర్ మండలంలో 176.3 మిల్లీమీటర్లు, మల్యాల మండలం మందుట్లలో 36.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జగిత్యాల-ధర్మపురి మధ్య అక్షయపల్లి వద్ద రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్షయపల్లి-నాగార మధ్య రహదారి తెగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎండిపోయిన చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లక్ష క్యూసెక్కుల పైగా అవుట్‌ఫ్లో వెళ్తున్నట్లు తెలిసింది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం నల్లవాగుకు కూడా వరద పోటెత్తింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com