గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి స్వాధీనం
అస్సాం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుంది. మంగళవారం అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్, టీటీడీ ఎస్టేట్ అధికారి సువర్ణమ్మ, ఈఈ సురేంద్ర రెడ్డిలకు సోనాపూర్ సర్కిల్‌లోని 10.33 ఎకరాల స్థలానికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ అందజేశారు.
కామ్రూప్ జిల్లా సోనాపూర్ సర్కిల్ పరిధిలో గౌహతి సమీపంలో ఈ భూమి ఉంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ పాలక మండలి కూడా ఈ విషయంలో అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేక లేఖలు రాశారు.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాంలో ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. త్వరలోనే ఇక్కడ భూమి పూజ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఆలయం ఈశాన్య భారతంలో ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com