US-Iran శాంతి ఒప్పందం: నేడే సంతకాలు అంటున్న ట్రంప్, ఇంకా సమయం కావాలంటున్న ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నేడు సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే హర్మోస్ జలసంధిలో నౌకా రవాణా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
ఇరాన్తో భవిష్యత్తు సంబంధాలు పూర్తిగా కొత్త దారిలో ఉంటాయని ట్రంప్ చెప్పారు. ఒబామా పాలనలో ఇరాన్తో ఒప్పందం కోసం వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేయగా, తాను ఒక్క డాలర్ ఖర్చు లేకుండా ఇరాన్ను ఒప్పందానికి ఒప్పించానని ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇరాన్‌లోని కొండల కింద నిల్వ ఉంచిన యురేనియంను తిరిగి తీసుకువస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అయితే చర్చలు ముగిశాయని, కానీ సంతకాలు చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. హర్మోస్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేయనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి ప్రకటించారు. ఈ టోల్ నిబంధన అమెరికాతో ఒప్పందంలో భాగమవుతుందని ఆయన చెప్పారు.
ఈ ఒప్పందంపై రెండు రోజుల క్రితం యూరప్‌లో సంతకాలు జరుగుతాయని ట్రంప్ ప్రకటించగా, తాజా ప్రకటనలో వేదిక గురించి ప్రస్తావించలేదు. అంతకు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, 24 గంటల్లో ఇరు నేతలు ముఖాముఖి సమావేశం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com