స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు; పాకిస్తాన్, కతార్ మధ్యవర్తులు
అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు స్విట్జర్లాండ్‌లో నేడు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయిల్-హెజ్బొల్లా ఉద్రిక్తతల కారణంగా ఈ చర్చలు వాయిదా పడిన తర్వాత పునరారంభం కావడం విశేషం. పాకిస్తాన్, కతార్ దేశాలు మధ్యవర్తులుగా ఈ చర్చలు జరుపుతున్నారు.
ఇజ్రాయిల్ లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 32 మంది మరణించిన ఘటనను నిరసిస్తూ ఇరాన్ తొలుత చర్చల ప్రయాణాన్ని రద్దు చేసింది. దీంతో అమెరికా ప్రతినిధులు సైతం తమ ప్రయాణాన్ని వాయిదా వేశారు. అయితే కొద్ది గంటల్లోనే మధ్యవర్తులతో చర్చించిన ఇరాన్ తాము చర్చలకు రానున్నట్లు ప్రకటించింది. అమెరికా కూడా చర్చలకు సిద్ధమైంది. అమెరికా ప్రతినిధులు విట్కాఫ్, కుష్నర్‌లు ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకోగా, ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా పాల్గొననున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ చర్చల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నట్లు తెలిసింది.
ఈ పరిణామాల మధ్యనే ఇరాన్ హార్మోజ్ జలసంధిని శనివారం మూసివేసింది. ఇరాన్ చర్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తూ, ఇరాన్‌తో 60 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే హార్మోజ్ గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్ వసూలు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక ఒప్పందం ప్రకారం 60 రోజుల వరకు టోల్ ఫీజు లేకుండా నౌకల రాకపోకలు సాగుతాయి.
మరోవైపు, హార్మోజ్ మూసివేతకు ముందే మూడు భారత చమురు నౌకలు సదరు జలసంధిని దాటేశాయి. వాటిలో 8.6 లక్షల టన్నుల ముడి చమురు ఉంది. దేశ్ వైభవ్, దేశ్ విభార్, సన్మార్ హెరాల్డ్ నౌకలు సురక్షితంగా బయటపడ్డాయని కేంద్రం ప్రకటించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com