ఆర్డీఎస్ ఆధునికీకరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) ఆధునికీకరణ పనుల వేగాన్ని పెంచాలని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. RDS ఆధునికీకరణ, తుంగభద్ర జలాశయం నిర్వహణ, అంతర్రాష్ట్ర నీటి పంపిణీ అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో రైతు ప్రతినిధులు, ఇంజనీర్లు, జలవనరుల నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. RDS హెడ్‌వర్క్‌లు శిథిలావస్థకు చేరుకోవడం, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోయి నిల్వ సామర్థ్యం తగ్గడం, పొరుగు రాష్ట్రాల అనధికారిక నీటి మళ్లింపులు వంటి సమస్యలను రైతు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి, అత్యవసర పునరుద్ధరణ చర్యలు చేపట్టి కాల్వలను పటిష్టం చేయాలని, నీటి నష్టాలను తగ్గించి సావర్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.
తుమ్మిడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను వేగవంతం చేయాలన్నారు. మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి భూసేకరణ వేగం పెంచాలని చెప్పారు. ఈ జలాశయాలతో 2.12 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. ముంపునకు గురయ్యే భూమి వివరాలను కూడా అధికారులు సమావేశంలో అందించారు.
తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులపై రాజీపడబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణ ప్రాతినిధ్యం చురుకుగా పనిచేసి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పారు. రైతుల ఆందోళనలు, న్యాయపరమైన అంశాలు, విధానపరమైన సవాళ్లపై నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూ తెలంగాణ నీటి హక్కులను పరిరక్షిస్తామన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com