శరీరంలో మంట తగ్గేందుకు ఐదేళ్లుగా చెరువులో గడుపుతున్న 16 ఏళ్ల యువకుడు
పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగ గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే కుర్రాడు ఒంట్లో తీవ్రమైన మంటతో బాధపడుతున్నాడు. శరీరం లోపల నిప్పులు పోసినట్లు మండుతుందని, నీటి చల్లదనంలో మాత్రమే ఉపశమనం లభిస్తుందని అతను చెప్పాడు. దీంతో గత ఐదేళ్లుగా అతను వారంలో ఐదు రోజులు చెరువులోనే గడుపుతున్నాడు. ఇక్బాల్ పరిస్థితిని చూపించే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే రోజులు తరబడి నీటిలో ఉండడం వల్ల అతని చర్మం నానిపోయి చర్మవ్యాధులు వచ్చాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా నిరంతరం వెంటాడుతున్నాయి. తల్లిదండ్రులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా చికిత్స ఫలించలేదు. ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ వైద్యం చేయించలేకపోతున్నారు.
దీంతో స్థానికులు చందాలు పోగు చేసి ఆ కుర్రాడికి వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వింత వ్యాధి నిర్ధారణ అయి సరైన చికిత్స దొరికితేనే ఇక్బాల్ నీళ్ల నుంచి బయటకు రాగలడని గ్రామస్తులు అంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com