మేడ్చల్ మేడిపల్లిలో ₹25 లక్షల విలువైన కల్తి మసాలాలు స్వాధీనం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో దాదాపు ₹25 లక్షల విలువైన కల్తి మసాలాలు పట్టుబడ్డాయి. SOT మల్కాజిగిరి, H-FAST బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సత్యనారాయణ రుద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు.
ఉప్పల్‌లోని రామంతపూర్‌లో మెహక్ మసాలాస్ యూనిట్‌పై కూడా దాడులు జరిగాయి. ఈ యూనిట్ మూడు నెలల క్రితం రిజిస్టర్ అయింది. కేవలం మున్సిపల్ లైసెన్స్ మాత్రమే ఉంది. ప్యాకింగ్ లైసెన్స్, FSSAI లైసెన్స్ లేదు.
ఆ యూనిట్లలో సుమారు 17 మంది పనిచేస్తున్నారు. గడువు ముగిసిన పాత ఉత్పత్తులను కొత్త ప్యాకెట్లలో వేసి కొత్త తేదీతో సీల్ చేస్తున్నట్లు గుర్తించారు. కారం పొడిలో ఉప్పు పొడి, మిర్చి తొడిమల పొడి కలుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com