ఆల్మట్టి డ్యామ్ నుంచి భారీ వరద విడుదల, మరో 2 రోజుల్లో శ్రీశైలంకు చేరే అవకాశం
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లో భారీ ఇన్‌ఫ్లో కారణంగా గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 112.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు.
ఈ నీరు నారాయణపూర్ ప్రాజెక్టుకు చేరుతోంది. నారాయణపూర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 38 టీఎంసీలు. ప్రస్తుతం 29 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రేపటి మధ్యాహ్నం లోపు ఇది పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిండిన వెంటనే దిగువ జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తారు.
జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం 9 టీఎంసీలు. ప్రస్తుతం అక్కడ 5.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్ నుండి నీరు వస్తే ఒకే రోజులో జూరాల నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తితే నీరు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుంది. అంటే సుమారు రెండు రోజుల్లో శ్రీశైలంకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.
శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 821 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా కేవలం 41 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. ఉపయోగించడానికి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 137 టీఎంసీలు (డెడ్ స్టోరేజ్ స్థాయి) మాత్రమే నిల్వ ఉంది. పశ్చిమ కనుమలలో వర్షాలు ఇలాగే కొనసాగితే శ్రీశైలం వరకు భారీ వరద చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com