అంబులెన్స్ కల్వర్టు ఢీకొని ఐదు రోజుల చిన్నారి మృతి
నంద్యాల జిల్లా చాగలమర్రి సమీపంలో 40వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు అంబులెన్స్ ప్రమాదానికి గురై కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు రోజుల మగ శిశువు మృతి చెందింది. మరో ఆడ శిశువుతో పాటు ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు.
కడప జిల్లా ముద్దునూరుకు చెందిన రైల్వే ఉద్యోగి శంకర్రావు, పద్మజా దంపతులకు ఐదు రోజుల క్రితం కడపలో కవల పిల్లలు పుట్టారు. నవజాత శిశువుల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణంలో ఆంబులెన్స్ రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. వాహనం లోపలి కుదుపుకు మగ శిశువు నుదిటికి తీవ్ర గాయమైంది. హైవే అంబులెన్స్లో ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందింది.
గాయపడిన ఆడ శిశువును మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన కడప జిల్లా గోపాయపల్లెకు చెందిన ద్విచక్ర వాహనదారుడు రామకృష్ణ రెడ్డిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com