జాతీయం

NEET-UG రీ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం: 22.79 లక్షల మంది విద్యార్థులు నమోదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
NEET-UG రీ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం: 22.79 లక్షల మంది విద్యార్థులు నమోదు
📷 Rajneesh Narula / Pexels
షేర్ కాపీ అయింది ✓

NEET-UG రీ ఎగ్జామ్‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరగనుంది. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం కేటాయించడంతో వారు సాయంత్రం 6:20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు NEET పరీక్షకు పేర్లు నమోదు చేసుకున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించేందుకు NTA భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పర్యవేక్షణ కోసం 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, స్వతంత్ర నిఘా కోసం 6,669 మంది అబ్జర్వర్లను నియమించింది. మొత్తంగా 2 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు NTA తెలిపింది.

ప్రశ్న పత్రాలను GPS అమర్చిన వాహనాలతో పోలీసు బందోబస్తు మధ్య తరలించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసి కేంద్రంలో కంట్రోల్ రూమ్ ద్వారా నేరుగా పర్యవేక్షిస్తారు. బయోమెట్రిక్ తో పాటు అత్యాధునిక మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు.

ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు పారదర్శకమైన బాటిల్లో నీళ్లు తమతో పాటు లోపలికి తీసుకెళ్ళవచ్చు. డయాబెటీస్ తో బాధపడే విద్యార్థులు షుగర్ టాబ్లెట్లు, అరటి పండ్లు, ఆపిల్, నారింజలను వెంట తీసుకెళ్ళేందుకు అనుమతి ఉంది.

విద్యార్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 నిమిషాల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు పరీక్ష కేంద్రం గేటు మూసివేస్తారు. విద్యార్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు ప్రింట్, ఒక ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్, అటెండెన్స్ షీట్ కోసం రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

తెలంగాణలో మొత్తం 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 73,024 మంది విద్యార్థులు NEET పరీక్షకు నమోదు చేసుకున్నారు. గత నెలలో జరిగిన NEET పరీక్షకు 71,304 మంది విద్యార్థులు హాజరయ్యారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com