క్యాన్సర్ ఔషధాల ధరలు భారీగా తగ్గాయి: రోగులకు భారీ ఊరట
క్యాన్సర్ ఔషధాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. వచ్చే నెల నుంచి సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి. షెడ్యూల్డ్ పరిధిలోకి రాని అన్ని రకాల క్యాన్సర్ ఔషధాల MRP పై ట్రేడ్ మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నిర్ణయంలో భాగంగా సవరించిన MRP ధరలతో 543 బ్రాండ్ల క్యాన్సర్ ఔషధాల జాబితాను నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) విడుదల చేసింది. ఈ ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయని NPPA తెలిపింది.
అక్టోబర్ 27 నాటికి తయారీ సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు పేర్కొంది. NPPA జాబితా ప్రకారం బివాసిజాబ్ అనే బ్రాండ్ ఇంజెక్షన్ ధర ఇదివరకు రూ. 21,767గా ఉండేది. సవరణ తర్వాత అది రూ. 5,930కు దిగివచ్చింది. అదేవిధంగా డిబ్రమాబ్ 60mg బ్రాండ్ ఇంజెక్షన్ ధర రూ. 22,310 నుంచి రూ. 5,941కు తగ్గింది.
ఈ నెల 17న 137 నాన్ షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్‌ను NPPA ప్రకటించింది. సవరించిన ధరల వివరాలను అందజేయాలని తయారీదారులను ఆదేశించింది. తయారీదారులు సవరించిన ధరలను సమర్పించినప్పుడల్లా జాబితా నవీకరించబడుతుందని NPPA తెలిపింది. క్యాన్సర్ బాధితులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రోగులకు పెద్ద ఊరటగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com