పత్తి పంటలో చీడపీడల నివారణ: రైతులకు శాస్త్రవేత్త సూచనలు
జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి పత్తి రైతులకు చీడపీడల నివారణపై సూచనలు అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట 20 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఎండు తెగుళ్లు, రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మొక్కలు వాడిపోయి ఎండిపోతే వేర్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ (బ్లైటాక్స్) మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ప్రతి మొక్కకు పోయాలని సూచించారు. ఎండు తెగులు ఎక్కువగా ఉంటే ఎకరానికి అర కిలో కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను యూరియాతో కలిపి చల్లాలన్నారు. వేర్లు దెబ్బతిని పోషకాలు అందుకోలేని మొక్కలకు మార్కెట్‌లో లభ్యమయ్యే 13:0:45 వంటి నీటిలో కరిగే ఎరువును లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని తెలిపారు.
వర్షాల తర్వాత పచ్చదోమ, తెల్లదోమ, తేనెబంక, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులు ఉధృతి చెందుతాయి. వాటి నివారణకు వేపనూనె, అసిఫేట్ (1.5 గ్రాముల/లీటర్) లేదా ఫిప్రోనిల్ (రీజెంట్) 2 ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎకరానికి 15-20 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టడం, సోలార్ లైట్ ట్రాప్‌లో సబ్బు నీళ్లు పోసి పురుగులను ఆకర్షించి చంపడం వంటి యాంత్రిక పద్ధతులు కూడా సమర్థంగా ఉంటాయని వివరించారు.
ముందస్తు నివారణగా ట్రైకోడర్మా విరిడి 2 కేజీలను 100 కేజీల మాగిన పశువుల ఎరువులో కలిపి తేమ ఉన్నప్పుడు నేలలో వేస్తే శిలింద్రం తెగుళ్లు రావని సూచించారు. ఆల్టర్నేరియా ఆకుమాడు, కాండమాడు (ఎర్రబూమిటి రోగం) నివారణకు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్‌ను 5 గ్రాముల/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని శాస్త్రవేత్త సలహా ఇచ్చారు. ఈ బయో నియంత్రణ ఉత్పత్తులు జిల్లా జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో లభ్యమవుతాయని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com